40 మందికి గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు... 10 మందికి పాజిటివ్
*గంజాయి వ్యసనానికి చికిత్సే మార్గం... డి-అడిక్షన్ సెంటర్లకు తరలింపు
*ఇప్పటివరకు 39 మందిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స
*గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో "యాంటీ డ్రగ్ వీక్" సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలతో పాటు వ్యసనానికి బానిసైన వారిని గుర్తించి వారికి చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 40 మందికి గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా, అందులో 10 మందికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి సేవించినట్లు గుర్తించిన వారిని తదుపరి వైద్య పరీక్షల అనంతరం డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి, నిపుణుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 39 మంది వ్యసనాపరులను డి అడిక్షన్ సెంటర్కు తరలించి చికిత్సను అందించడం జరిగిందని తెలిపారు. వ్యసనానికి బానిసైన వ్యక్తులను శిక్షించడం మాత్రమే కాకుండా, వారికి సరైన చికిత్స అందించి కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడిపేలా చేయడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. గంజాయి సేవించే వ్యక్తులు స్వచ్ఛందంగా వ్యసన విముక్తి కేంద్రాలను ఆశ్రయించాలని, కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని గుర్తించి చికిత్సకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ అధికారులకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, పండించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా" లక్ష్య సాధన కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, డి-అడిక్షన్ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

