ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందించిన నిమ్స్
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వాస్క్యులర్ సర్జరీ విభాగం వైద్యులు అత్యాధునిక AngioJet Pharmaco-Mechanical Thrombectomy విధానాన్ని ఉపయోగించి **Acute Deep Vein Thrombosis (DVT)**తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, బయ్యారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల మహిళ కొలిచేల్మి రజినీకి ఈ అత్యాధునిక చికిత్సను నిమ్స్‌లో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించారు.
Deep Vein Thrombosis (DVT) అనేది కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే తీవ్రమైన వ్యాధి. సకాలంలో చికిత్స అందించకపోతే ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరి Pulmonary Embolismకు దారితీసి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఈ చికిత్సలో ఉపయోగించిన AngioJet Pharmaco-Mechanical Thrombectomy పద్ధతిలో ముందుగా రక్తం గడ్డను కరిగించే ప్రత్యేక ఔషధాలను నేరుగా గడ్డ ఉన్న ప్రాంతంలో ప్రవేశపెట్టి, అనంతరం AngioJet పరికరం సహాయంతో ఆ గడ్డను వేగంగా తొలగిస్తారు. దీనివల్ల రక్తప్రసరణ తక్షణమే పునరుద్ధరించబడటంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కాళ్ల వాపు, నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ గారు మాట్లాడుతూ, సుమారు రూ.5లక్షల వరకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా పూర్తి చేశామని తెలిపారు. అత్యాధునిక వైద్య చికిత్సలను ప్రజలకు ఉచితంగా అందించడం నిమ్స్‌కు గర్వకారణమని తెలియచేసారు
ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వాస్క్యులర్ సర్జరీ విభాగం హెచ్ ఓ డి డా. సందీప్ మహాపాత్ర మరియు డా. అనూష, డా. అరుణశ్రీ, డా. ఊహ, డా. శ్రీనిధి, డా. సుదర్శన్, డా. అమర్‌నాథ్, డా. త్రివిక్రమ్, డా. కీర్తన, డా. నలిన్ కృష్ణ, డా. నరేన్తో పాటు సహకరించిన అనస్థీషియాలజీ విభాగం, క్యాథ్ ల్యాబ్ బృందం, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర అనుబంధ వైద్య సిబ్బందిని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ గారు అభినందించారు.

