Sports & Games

Breaking News

నర్సింగ్ ఆఫీసర్ల మెరిట్ జాబితా విడుదల.ANM 1931 పోస్టు తో పాటు..7267 వివిధ పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి.. వైద్య ఆరోగ్యశాఖలో9572 పోస్టుల భర్తీ పూర్తి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్న బోర్డు

భర్తీకానున్న 2,322 పోస్టులు
--
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 1257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతరత్రా వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మొత్తం 2322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. వెంగళరావు నగర్‌లోని‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండగా, ఎవరెవరు ఎప్పుడు వెరిఫికేషన్‌కు రావాలనే వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది. 2024లో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోనుంది.

 *రికార్డు స్థాయిలో నియామకాలు* 
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో 9,572 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తీ పూర్తయిన వాటితో సరిపెట్టుకోకుండా, 2026లో మరో 7,267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టులు, స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ) పోస్టులు, ఫార్మసిస్టులు (గ్రేడ్-2) పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, తదితర పోస్టులు ఉన్నాయి.

 *నాడు 18 వేలకుపైగా ఖాళీలు* 
ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఇప్పటివరకు భర్తీ చేసినవి, ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నవి కలుపుకుని ఈ ఏడాది జూన్ నాటికి సుమారు 16,839 పోస్టులు భర్తీ కానున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్ సర్కార్, 2020లో కోవిడ్ వచ్చే వరకూ అసలు ప్రభుత్వ వైద్య వ్యవస్థను పట్టించుకోలేదు. కోవిడ్‌లో ప్రభుత్వ హాస్పిటళ్ల డొల్లతనాన్ని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టడం, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో.. చివరి మూడు సంవత్సరాలు హాస్పిటళ్ల అప్‌గ్రెడేషన్‌కు భారీగా జీవోలు ఇచ్చారు. అక్కడక్కడ కొత్త భవనాల నిర్మాణ పనులను మొదలు పెట్టి, పూర్తి చేయలేకపోయారు. ఇక డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్‌మెంట్ సంగతి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరసి 2023 డిసెంబర్‌‌లో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీ పోస్టుల సంఖ్య 18 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆరోగ్యశాఖ మంత్రిగా సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీలు అన్నీ భర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆయన భావించి, ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 

 *జూన్ నాటికి 16 వేల పోస్టుల భర్తీ* 
మంత్రి దామోదర్ పర్యవేక్షణ, వరస రివ్యూలు, కోర్టు కేసులపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వాటిని క్లియర్ చేయించడంతో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయనన్న పోస్టులను ఈ రెండేళ్లలో ఆరోగ్యశాఖలో భర్తీ చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 18 వేలకుపైగా పోస్టుల్లో, ఈ ఏడాది జూన్ నాటికి 16,839 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతోంది. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల నుంచి మొదలుకొని స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.


 *ఇప్పటికే భర్తీ పూర్తయిన పోస్టుల వివరాలు* :
నర్సింగ్ ఆఫీసర్లు: 6,956
ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2): 1,542
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (CAS): 425
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-4): 334
ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు: 138
ఫిజియోథెరపిస్టులు: 48
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-3): 39
అసిస్టెంట్ ప్రొఫెసర్లు (MNJ): 28
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు: 24
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (గ్రూప్-1): 20
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు: 18
మొత్తం: 9,572

 *భర్తీ ప్రక్రియలో ఉన్న (In Progress) పోస్టులివే* :
నర్సింగ్ ఆఫీసర్లు: 2,322
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్): 1,931
స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ): 1,623
ఫార్మసిస్టులు (గ్రేడ్-2): 732
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 607
డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు: 48
స్పీచ్ పాథాలజిస్టులు: 4
మొత్తం: 7,267