Sports & Games

Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో 14 వేల మంది NHM సిబ్బంది రాజీనామా?....

రాయ్ పూర్‌,(ఆరోగ్యజ్యోతి):  జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం)లో పని చేస్తున్న సిబ్బంది తమ సమస్యల కోసం పోరాడుతుంటే..ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడింది. ఆందోళనల్లో పాల్గొన్న 25 మంది ఎన్‌ఎహెచ్‌ఎం సిబ్బందిని తొలగించి ఉద్యమాన్ని అణిచేసేందుకు ప్రయత్నించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 25 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే తాము కూడా విధులకు వచ్చే ప్రసక్తే లేదంటూ దాదాపు 14 వేల మంది పైగా ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అధికారులు, ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 18 నుండి ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీరించాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు. దీర్ఘకాలంగా నెరవేరని వారి డిమాండ్లను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకుందని ఛత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ ఎన్‌హెచ్‌ఎం కర్మచారి సంఫ్‌ు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అందరికీ సమానమైన, అందుబాటులో వుండే,నాణ్యతాపరమైన ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో జాతీయ హెల్త్‌ మిషన్‌ ఏర్పాటైంది. ఈ ప్రోగ్రామ్‌ కింద విస్తృత స్థాయిలో డాక్టర్లు, నర్సులతో పాటూ ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తూంటారు. వీరి సమ్మె వల్ల కీలకమైన పలు విభాగాల ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. టీకాలు వేయడం, నవజాత శిశు సంరక్షణ, ఫిజియోథెరపీ, జనన, మరణ ధృవీకరణపత్రాల జారీ, టిబి మందుల పంపిణీ ఇలాంటివన్నీ స్తంభించాయని అధికారులు తెలిపారు.