- జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా ముందుండాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత అన్నారు. శనివారం అపోలో సంస్థ, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో పాటు పిరమల్ స్వాస్థ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎంపికైన ఉద్యోగులు జిల్లా క్షయ నివారణ అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుమలత మాట్లాడుతూ క్షయవ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతి ఆరోగ్య సిబ్బంది ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో క్షయ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి సకాలంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తిగా కొనసాగిస్తే క్షయవ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పరీక్షలు, ఉచిత మందులు, పోషకాహార సహాయం వంటి సేవలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.నూతనంగా ఎంపికైన సిబ్బంది ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ, క్షయ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగులు జిల్లా క్షయ నివారణ అధికారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపినారు. కమ్యూనిటీ హెల్త్ వర్క్ లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో బి సునీల్ కుమార్, నావిద్, జి గంగన్న సిహెచ్ సుకన్య సిహెచ్ స్వప్న , దయాకర్, శిల్ప, శ్రీలత పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

