ఆదిలాబాద్ జిల్లాలో 77,910 మంది చిన్నారులే లక్ష్యం : డీఎంహెచ్వీ సాధన
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని, ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సాధన పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌తో పాటు పోలియో చుక్కల మందును ఆమె ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 77,910 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని వివరించారు.
జిల్లాలో మొత్తం 730 పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో ఈ బూత్‌లు పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో 27 ప్రత్యేక మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ప్రయాణికులు, వలస కుటుంబాల చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేయనున్నాయని తెలిపారు.
పల్స్ పోలియో కార్యక్రమం కోసం జిల్లాకు మొత్తం 85,600 పోలియో డోసులు అందినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, పర్యవేక్షకులు, స్వచ్ఛంద కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
జూన్ 28న జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు బూత్‌లకు రాలేని లేదా ఏదైనా కారణంతో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వివరించారు.
ప్రతి తల్లిదండ్రి తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో బూత్‌కు తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రెండు చుక్కల మందు చిన్నారులను జీవితాంతం పోలియో బారిన పడకుండా కాపాడుతుందని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై.సి. శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
I

