ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి" అనే సందేశంతో 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ నాయకత్వం వహించారు.
ఈ 5కే రన్‌లో విద్యార్థులు, యువత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. సమాజంలో ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న నరేష్ సేవలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత సేవలు అందిస్తున్నందుకు ఆయనకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
నరేష్ చాలా కాలంగా రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి భద్రత, రోగులు మరియు వారి సహాయకులకు అవసరమైన సహకారం అందించడంలో విశేష సేవలు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. విధి పట్ల అంకితభావం, సమయపాలన, సేవా దృక్పథంతో పనిచేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు.
ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పలు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారని, ఈ తాజా సత్కారం కూడా ఆయన సేవలకు మరో గుర్తింపుగా నిలిచిందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభినందించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.

