మధ్యాహ్న భోజన వంట ధరల పెంపు
కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట ధరలను కేంద్రం పెంచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వంట ఏజెన్సీ మహిళలు 1-5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున చెల్లిస్తుండగా.. దాన్ని రూ.6.19కి పెంచారు. 6-8 తరగతుల పిల్లలకు రూ.8.17 చెల్లిస్తుండగా, రూ.9.29కు పెంచారు. కొత్త ధరలు డిసెంబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60, రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం అందజేస్తాయి. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెలను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 9, 10 తరగతులకు సొంత నిధులను వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాయి
ఇక రెండేళ్లకు ఒకసారేనా?
చివరిసారిగా మధ్యాహ్న భోజనం ధరలను కేంద్ర ప్రభుత్వం 2022లో పెంచింది. వాస్తవానికి ఏటా 7-8 శాతం పెంచాల్సి ఉండగా 2023లో పెంచలేదు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెరగాలంటే కనీసం మరో రూ.2 అయినా పెంచాలని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.గురుకులాల్లో ధరలకు సమానంగా ఉండేలా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను భరించాలని ప్రధానో పాధ్యాయులు సూచిస్తున్నారు.