Sports & Games

Breaking News

కేటీఆర్ రైతు సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదం

.కేటీఆర్ రైతు సంక్షేమం గురించి మాట్లాడడం హాస్యాస్పదం.. 
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు రైతులకు చేసింది శూన్యం.. 
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేసి చూపించింది.. 

 - తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం హాస్య స్పదంగా ఉందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  పదేళ్ల  పాలనలో లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం బిఆర్ఎస్ దేనన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల అప్పుల కుప్పగా మార్చారని , వారు చేసిన అప్పులకు కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం వడ్డీ కడుతుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగా లేకున్నప్పటికి  ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూపాయలు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.  దీన్ని స్వాగతించాల్సింది పోయి  రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేయడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తికి కనీస మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలను పోలీసులచే అరెస్టులు చేయించి ఇబ్బందులకు గురిచేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే  సబ్సిడీలు ఎత్తివేయడం ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు కాకుండా మొండి చేయి చూపిన ఘనత టిఆర్ఎస్ కే దక్కుతుందని ద్వజమెత్తారు. కేటీఆర్ రైతుల సంక్షేమం పేరిట మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు .జిల్లా కేంద్రంలోనీ బహిరంగ సభలో  కేటీఆర్ చేసిన మాటలను విని  ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.  రైతుల కోసం ఏడాదికైనా జైలుకు వెళ్తానని ప్రకటించిన కేటీఆర్ తాను చేసిన బాగోతాలకు ఎప్పటికైనా జైలుకి వెళ్ళడం ఖాయమన్నారు. ఇచ్చిన మాట మేరకు రైతులందరికి రుణమాఫీ ప్రక్రియ జరిగిందని, టెక్నీకల్ లోపాల ద్వారా రుణమాఫీ కానీ రైతుల నుండి ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, త్వరలోనే అర్హత కలిగిన రైతులందరికి తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులే టిఆర్ఎస్ నాయకులను తరిమికొట్టే పరిస్థితులు వస్తాయనీ హెచ్చరించారు.మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తాడిసేన వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, కొరటి ప్రభాకర్, అడెళ్లు, రంజిత్ రెడ్డి, గౌతమ్, ఫెరోజ్ ఖాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.