Sports & Games

Breaking News

బస్తీ దవఖాన ఉద్యోగులకు ప్రభుత్వం నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలి - ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్న

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*నామమాత్రంగా బస్తీ దవాఖానాలు*

*రెగ్యులర్ పోస్టులు రావడంతో పలువురు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల రాజీనామాలు*

• *సిబ్బంది కొరతతో సేవల కుదింపు*

*బస్తి దవాఖాన  ఉన్నవారికి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్*

*తెలంగాణ ఆరోగ్య జ్యోతి బ్యూరో - హైదరాబాద్*

చిన్న చిన్న రోగాలు వస్తే ప్రాథమిక దశలో పేదలకు వైద్యమందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ ను స్ఫూర్తిగా తీసుకుని తొలుత హైదరాబాద్, ఆ తర్వాత జీహెచ్ఎంసీ పరిధికి విస్తరించారు. వాటికి మంచి స్పందన లభించడం, పేద రోగులకు సేవలందడం, పెద్దాస్పత్రులపై చిన్న చిన్న రోగాల బారిన పడిన వారి రద్దీ తగ్గడం, బోధనాస్పత్రుల్లో వైద్యులు సంక్లిష్ట కేసులపై శ్రద్ధ చూపించేందుకు సానుకూలత ఏర్పడటం వంటి విజయాలు బస్తీ దవాఖానాల ఏర్పాటు తర్వాత గమనించారు. పరిమిత సంఖ్యలో ప్రారంభమైన బస్తీ దవాఖానాల సంఖ్య క్రమేణా పెంచుతూ దాదాపు 500 వరకు విస్తరించారు. ఒక బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్  కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించి సేవలందించారు. ఇటీవల స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ పోస్టింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో దాదాపు 90 మంది స్టాఫ్ నర్సులు బస్తీ దవాఖానాల్లో సేవలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే విధంగా రెగ్యులర్ పోస్టులు వచ్చిన డాక్టర్లతో పాటు వివిధ కారణాలతో రాజీనామాలు చేసిన వారు దాదాపు 50 మంది వరకున్నట్టు సమాచారం. వీరు వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయకపోవడంతో పలు బస్తీ దవాఖానాలు సేవల విషయంలో నామమాత్రంగా మారాయని ప్రజలు వాపోతున్నారు.డాక్టరు ఉన్న చోట స్టాఫ్ నర్సు లేరు. స్టాఫ్ నర్సు ఉన్న చోట డాక్టర్ లేరు. ఇలా వీటి పరిస్థితి తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తీ దవాఖానాల్లో ఖాళీల భర్తీని వెంటనే చేపట్టకపోవడంతో సిబ్బంది కొరత వెక్కిరిస్తున్నది. దీంతో పర్యవేక్షణాధికారులు ఇలాంటి ఇబ్బందులున్న బస్తీ దవాఖానాల విషయంలో ఒక్కో స్టాఫ్ నర్సుక్కు, డాక్టర్కు రెండేసి బస్తీ దవాఖానాల బాధ్యతలు అప్పగించినట్టుతెలుస్తున్నది. గతంలో రెగ్యులర్ టెస్టులు, డాక్టర్ కన్సల్టేషన్ అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం, రెగ్యులర్గా కాకుండా సర్దుబాటు సమయాల్లో మాత్రమే ఆయా సేవలు అందిస్తున్నారు. మరీ ఇబ్బందిగా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో బస్తీ దవాఖానాల ఏర్పాటు మౌలిక లక్ష్యమే దెబ్బతింటున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు ఉన్న సిబ్బందికీ గత నాలుగు నెలల నుంచి జీతాలు పెండింగ్లోలో ఉండటంతో వారిలో నైరాశ్యం నెలకొంది. పలుమార్లు ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. ఆ జీతాలను వెంటనే విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేస్తే బస్తీ దవాఖానాల ఏర్పాటు ఉద్దేశం నెరవేరుతుంది.