అనుమతులు నిబంధనలో అంతంత మాత్రమే?
• శంకర్ దాదాలతో సేవలు బిల్లుల పేరుతో దోపిడీ
• రెన్యూవల్ చేయించుకోరు కొరవడిన సర్కార్ పర్యవేక్షణ.
• ప్రైవేటు ఆస్పత్రుల తీరిది తాజా తనిఖీల్లో వెలుగులోకి
-ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 ఆస్పత్రులకు నోటీసులు.
కరీంనగర్ : ఒకప్పుడు సేవాదృక్పథంలో ఉన్న వైద్య రంగం ప్రస్తుతం వ్యాపారదృక్పథంగా మారడంతో ప్రైవేటు ఆస్పత్రులు కోకొల్లలుగా ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు వస్తే పండగే పేద, ధనిక, మధ్యతరగతి అని చూడకుండా అధిక బిల్లులు వసూళ్లు చేయడం పరిపాటి అయింది. అడిగినంత బిల్లులు చెల్లించడంతో మంచి ఆదాయం తెచ్చే ఒక పెద్ద వ్యాపారంగా వైద్య రంగం తయారైంది. ఇదే తరుణంలో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. చాలామంది తమకు ఉన్న ధన, రాజకీయ బలం ఉపయోగించుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కనీసం క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. అరకొర వైద్య సేవలు అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆస్పత్రి ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేయించాలి. కానీ అలారెన్యూవల్ కూడా చేయించకుండా కొనసాగిస్తున్నారు.
తనిఖీల్లో బయటపడుతున్న డొల్లతనం
తెలంగాణలో ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుపుతున్నారన్న విషయం బయటకు వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ లేని వారు వైద్య సేవలు అందిస్తున్నారని కూడా వెల్లడైంది. దీంతో అన్ని జిల్లాల్లో ఆస్పత్రుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అనుమతులు లేకుండా నడుపుతున్న 25 ఆస్పత్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఆస్పత్రుల యజమానులు ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. వారి సమాధానాలను బట్టి అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ఇంకా ఎన్ని ఉన్నాయో?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 1,233 ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో 590, జగిత్యాల జిల్లాలో 285, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 105, పెద్దపల్లి జిల్లాలో 253 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఒక్క కరీంనగర్లోనే 25 ఆస్పత్రులకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అయితే పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే ఇంకా ఎన్ని ఆస్పత్రులకు అనుమతులు లేవో బయటపడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
నిబంధనలకు తిలోదకాలు
అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదని పలువురు
రోగులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ధరల పట్టికలు ఏర్పాటు చేయడం లేదు. మాతాశిశు ఆస్పత్రుల్లో ప్రసవాలు, మరణాలు పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా ఆస్పత్రుల యజమానులు అలా నమోదు చేయడం లేదని తెలిసింది. అలాగే బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఎంసీఈ చట్టం 2008, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, జీవోనెం. 35, 135లను అనుసరించి ప్రైవేటు ఆస్పత్రులు, డెంటల్ క్లినిక్లు, పిజియోథెరపీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. సుమారు 24 రకాల లైసెన్స్లు పొందాలి. ప్రతి అస్పత్రికి ఎంబీబీఎస్ లేదా ఆపైన అర్హతగల వారు బాధ్యులుగా ఉంటూ. అనుమతులు పొందాలి. ఒకవేళ ఫార్మసీ ఏర్పాటు చేస్తే ఫార్మసిస్టు, లేబొరేటరీ ఏర్పాటు చేస్తే డీ.ఎల్బీఏ. ఏఎన్ఎం ఇలా క్వాలిఫైడ్ పర్సన్స్ ను నియమించు కోవాలి. కానీ సర్టిఫికెట్లను చూపించి అనుమతులు పొందుతూ క్వాలిఫైడ్ లేని వ్యక్తులతో వైద్యసేవలు అందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
పర్యవేక్షణా లోపం
ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షించకపోవడంతో యజమానుల ఇష్టా రాజ్యమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయి రిజిస్ట్రే షన్ అథారిటీ, జిల్లా సలహా మండలి సమావేశాలు నిర్వహించి ప్రైవేటు ఆస్ప త్రులకు అనుమతులు ఉన్నాయో... లేవో.. అనేది పరిశీలించాలి. అలాగే ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలి. కానీ అలా జరిగే దాఖలాలు కనిపించడం లేదు. జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ, జిల్లా సలహా మండలిలో చైర్మన్ గా జిల్లా కలెక్టర్, కన్వీనర్గా డీఎంహెచ్ఎ్వ, సభ్యులుగా పోలీసు కమిషనర్ లేదా ఎస్పీ, ఐఎంఏ సభ్యుడు, వినియోగదారుల కమిటీ నుంచి ఒకడు సభ్యులుగా ఉంటారు.