¢. 49. బ్యాక్టీరియా వల్ల కలిగే లాభ నష్టాలు.
సూక్ష్మజీవుల సంగతులు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుని జాగ్రత్త పడటానికి ఒక ముఖ్య కారణం, వాటి ద్వారా మనకు సంక్రమించే రకరకాల జబ్బులు. అవన్నీ వర్ణించాలంటే పెద్ద వైద్య గ్రంథమే తయారవుతుంది. వివిధ బ్యాక్టీరియా మన శరీరాలపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయో, జీవకణాల స్థాయిలో వాటికి ఎటువంటి ప్రతిఘటన ఎదురవుతుందో ఇలా అంతా ఒక ప్రత్యేక శాస్త్రమే. అంత లోతైన విశ్లేషణ అవసరం లేని మన వంటి వారికి, బ్యాక్టీరియా గురించిన కొన్ని ముఖ్య విషయాలు మాత్రమే ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కళ్ళకి మురికిగా అనకపోయినా వీలైనన్నిసార్లు శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉంటే మనం చాలా రకాల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అయినా తరచూ మనం తెలిసిన మూర్ఖుల లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇటువంటి ఒకటి అలవాట్ల స్థాయిలో అమలు అయితే తప్ప జ్ఞానం మాత్రమే ఉండి మనకు ఏమీ ప్రయోజనం ఉండదు. క్రిముల బెడద తగ్గాలంటే సబ్బుతో వేలి కొసలనూ, గోళ్ళ కింద కనీసం 20_ 30 సెకండ్ల పాటు నురుగు వచ్చేలా కడుక్కోవాలి. తుమ్ము తున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు ముఖానికి జేబురుమాలు వంటిది అడ్డం పెట్టుకుని ఉంటే, మన బ్యాక్టీరియా అందరికీ ఉచిత సరఫరా కాకుండా ఉంటుంది. ఇలా చేయని వారిని సున్నితంగా హెచ్ఛరించడం కూడా మన బాధ్యతే. రోడ్డు మీద నడుస్తూ ఖళ్ళున దగ్గి, ముక్కుఛీదుకునీ, పక్కనే ఖాండ్రించి ఉమ్మేసి, చేతిని ఏ దీపస్తంభానికో తుడుచుకునే సాంప్రదాయం ఉన్నా మన దేశంలో ఇలాంటివి చెప్పడం అరణ్యరోదనే అనిపిస్తుందేమో. కానీ వీటి గురించి కనీసం ఒక సారి మననం చేసుకోవడం చాలా అవసరం. మనలో ఆరోగ్యవంతులకు సామాన్యంగా పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. కనక మనపై నిత్యము దాడిచేసే భయంకరమైన సూక్ష్మజీవుల గురించి మనం) ఖర్మకాలి జబ్బు పడేదాకా) పట్టించుకోం.సూక్ష్మ జీవుల గురించిన మన నిర్లక్ష్యానికి ముఖ్య కారణం అవి మనకు కనబడకపోవడం మే. అదే ఏ బొద్దింకో, పందికొక్కో మన కంట పడితే పాత చెప్పు తీసుకుని,బడితెతో దాని వెంట పడతాం. ప్రాణికోటి లో మనం స్పష్టంగా చూడగలిగిన జంతువులు, మొక్కలు, పుట్టగొడుగుల సిలింద్రాలు మాత్రమే కాక, సూక్ష్మజీవులు కూడా ఉన్నాయని మనకు తెలుసు. అయితే చాలా మందికి తెలియని దేమంటే ఈ మొత్తం పరిమాణంలో 80% సూక్ష్మ జీవులే ననే సంగతి. వీటిలో ఒక్కొక్కటి ఎంతో సూక్ష్మ మైనవి కనుక, వీటి మొత్తం సంఖ్య ఎంత అపారమైన దో మనం ఊహించుకోవచ్చు. మన లాంటి పెద్ద ప్రాణులన్నీ ఈ రద్దీ లోనే ఆవిర్భవించి పెరిగాయి. కనుకనే వాటి తో సహజీవనం మనకు తప్పనిసరి అవుతుంది. ఆదిమ యుగం లగాయతు ఇప్పటిదాకా భూమి మీద మొత్తం 10 వేల కోట్ల మంది మనుషులు జీవించారని ఒక అంచనా. వీరంతా చచ్చిపో గా, శవాల మీద బ్యాక్టీరియా తమ పని ప్రారంభిస్తాయి. మనుషులే కాదు, లెక్కలేనన్ని జంతువులు, పక్షులు ఇవన్నీ చేసిన మలవిసర్జన, ఇదంతా తలుచుకుంటే పర్వతాలంత భయంకరమైన గుట్టలుగా ఉండేవని అర్థం చేసుకోవచ్చు.. అసలు వీటితో కప్పబడిన నేల మీద, మొక్కలు, పంటలు, మొలవడం కొత్త జాతి ప్రాణులు పుట్టుకురావడం ఇవేమీ సాధ్యమై ఉండేవి కాదు. బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పదార్థాలన్నింటినీ భక్షించి, మూల పదార్థాలు గా మార్చడం వల్లనే బ్రహ్మాండమైన రీసైక్లింగ్ జరిగి ఈ ప్రాణికోటి బ్రతక కలుగుతుంది. బ్యాక్టీరియా జీర్ణించుకోలేని వింత ప్లాస్టిక్ వస్తువులను, ఎక్కడపడితే అక్కడ వ్యర్ధపదార్ధాలు గా మిగిలిపోవడం, మన ఆధునిక సమాజం చేస్తున్న తప్పుల ఫలితమే. ఇలా బయోడిగ్రేడబుల్ కానీ ప్లాస్టిక్ సంచుల వంటి వస్తువులను నిషేధించే చర్యలు అందుకే అవసరమైనవి గా భావించాలి.అయినా బ్యాక్టీరియా రకాలన్నీ మనం అనుకున్నంత హానికరమైనవి కావు. వెయ్యి రకాల్లో ఒక్కటి మాత్రమే మనకు ప్రమాదకరం కావచ్చు. వీటిలో చాలావరకు మనల ను జబ్బులతో పీడించి వదులుతాయి. ఆ జబ్బులు చావుకు దారితీసినట్లయితే మనతో పాటు అవి కూడా చచ్చిపోతాయి. కనుక అంత పని చెయ్యవు. అలా మనని ఇబ్బందులకు గురి చేసినందువల్ల వాటికి ఏం లాభం అనిపిస్తుంది. కానీ వాటికి లాభం కలిగే మాట వాస్తవమే. మనకు వచ్చే తుమ్ములు, వాంతులు, విరోచనాలు వగైరాలన్నీ వాటిని బయటికి రప్పించి ఇతర ప్రాంతాలకు చేరవేయ గలవు. దోమల వంటివి కూడా అవి అంతట వ్యాపించడానికి తోడ్పడతాయి. ఈ విషయాలన్నీ అవి ఆలోచించగలిగిన వి కాదు. ఇదంతా జీవపరిణామంలో భాగమే. తీవ్రమైన హాని కలిగించి మనుషులను చంపి, తాము కూడా వారితో పాటుగా తుడిచిపెట్టుకు పోయినవి సూక్ష్మ జీవులు కూడా ఉన్నాయి. 15వ శతాబ్దం అంతంలో చెమటలు పట్టే ఒక వింత వ్యాధి వల్ల ఇంగ్లాండ్లో వేలకొద్దీ జనం చనిపోయారట. అంతుచిక్కని ఈ రోగానికి ఎటువంటి చికిత్స పని చేయలేదు. కానీ ఐదారు దశాబ్దాల్లో చచ్చిన వారుచావగా ఆ బాక్టీరియా కు స్తావరాలన్నీ మూత పడటంతో అవి అదృశ్యమై పోయినట్టుగా తెలుస్తుంది. మన రక్తంలో ఉండే తెల్ల కణాలు, ఎటువంటి దాడిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. రకరకాల ఆకారాల్లో వచ్చిపడే సూక్ష్మజీవులను తగిన విధంగా ఎదుర్కోడానికి దాదాపు కోటి రకాల తెల్ల కణాలు గస్తీ తిరుగుతూ ఉంటాయి. రోగక్రిములను ఆచూకీ తెలియ గానే, ఫలానా రకం కణాల సేన అవసరం కలుగుతోందని సూచన అందుతుంది. వెంటనే అటువంటి కణాలా తయారీ మొదలవుతుంది. మనం జబ్బుతో బాధ పడేది ఆ పరిస్థితుల్లోనే. ఎదురుదాడి మొదలవగానే మన ఆరోగ్యం కుదుటపడ ప్రారంభిస్తుంది.సూక్ష్మజీవుల ప్రపంచం లో ఉంటూ వాటికి మనం వెరచి లాభం లేదు. మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అవి యధేచ్ఛగా మన శరీరమంతటా, వీలున్న చోటల్లా విస్తరిస్తూనే ఉంటాయి. మన దేహం లో నే ఒక ప్రాంతంలో నిరపాయకరమైన బ్యాక్టీరియా ఏ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళగానే ప్రాణం మీదకి తెస్తాయి. కొన్ని రకాలు చాలా ఏళ్ల పాటు నిద్రాణంగా కొనసాగుతూ, మరేదో కారణం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ కుంటుపడినదాన్ని అవకాశంగా తీసుకుని విజృంభిస్తాయి. తూర్పు ఆసియాలో సునామి చెలరేగినప్పుడు, మొన్న ముంబైలో విపరీతంగా వర్షాలు కురిసినప్పుడు, అలాగే అమెరికాలో కత్రినా దాడి చేసినప్పుడు నీరంతా కలుషితం అయిపోయింది. మురుగునీరు అంతా మంచి నీటిలో కలిసి పోగానే, అందులో ఉన్న బ్యాక్టీరియా తమ ప్రతాపం చూపించడం మొదలెట్టాయి. అంతేకాక మనుషులవి, జంతువుల కళేబరాలు కొట్టుకు రావడంతో, వాటికి విందుభోజనం ఏర్పడినట్టు అయింది. ఈ కారణాల వల్ల జీర్ణ కోశ వ్యాధులు, కలరా, హైపటైటిస్, లెఫ్టో స్పైరో సిస్ మొదలైన భయంకరమైన రోగాలు ఎందరినో పొట్టన పెట్టుకున్నాయి. సామాన్య పరిస్థితులలో సామూహికంగా, మనం ఇటువంటి విషయాల గురించి తీసుకునే జాగ్రత్తలు ఎంత ముఖ్యమైనవో దీన్ని బట్టి తెలుస్తుంది. పెద్ద సిటీల్లో మురుగునీరు అంతటినీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లకు తరలించి అక్కడ పెద్ద ట్యాంకుల్లో, గాలి బాగా తగిలేలా బ్యాక్టీరియాచేత పని చేయిస్తారు. జీతం బత్తెం లేకుండా అవి నీటిని శుద్ధి చేసి పెడతాయి. చిన్నచిన్న రుగ్మతలు కలిగినప్పుడు తగిన వ్యవధి ఇస్తే మన దేహం రోగక్రిములను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ప్రతి చిన్న జబ్బుకు యాంటీ బయాటిక్ మందుల వంటివి తీసుకుంటూ ఉంటే, ఒక వంక మనలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా నాశనమవుతాయి. నిజంగా హానికరమైన బ్యాక్టీరియా కొత్త పరిస్థితికి అనుగుణంగా, తన లక్షణాలను మార్చేసుకుని, మందులను నిరోధించగలిగే రెసిస్టెంట్ జాతిగా తయారవుతుంది. క్షణాల్లో రోగాలు నయం చేయగలవని మందుల కంపెనీలు కేకలు పెట్టడంతో, మామూలు ప్రజలు ప్రతిదానికి ఇటువంటివి వాడకం మొదలు పెడితే జబ్బు కన్నా చికిత్సే ప్రమాదకరం అవుతుంది.