జెన్యూ మార్పిడి చేసిన విత్తనాలను ఉపయోగించవద్దు
ఎడిటర్ కే నరేష్ కుమార్ - 9 8 4 8 0 2 5 4 5 1
వ్యవసాయరంగంలో జన్యుమార్పిడి చేసిన విత్తనాలు ఉపయోగించి పండించే ఆహార పంటల వల్ల ప్రజల మనుగడకే ప్రమాదం వాటిల్ల నుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమీషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్‌రెడ్డి గారి అధ్యక్షతన జన్యుమార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాలు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ) రైతు సంఘం నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని పలు విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జన్యుమార్పిడి విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. జన్యుమార్పిడితో రైతులు విత్తన స్వాతంత్య్రం కోల్పోవడమే కాకుండా విత్తనాలు కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. జన్యుమార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బీటీ పత్తితో దేశంలో పత్తి దిగుబడి పెరగలేదని, మెరుగుపడలేదని, రసాయనాల వాడకాన్ని తగ్గించలేదన్నారు. దానికి భిన్నంగా రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగిందని, కాయతొలుచు పురుగులతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకుసాగుదామని నిర్ణయించారు.
సమావేశంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జన్యుమార్పిడి పంటలతో ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ తీవ్రంగా ప్రమాదం వాటిల్లుతుందన్నారు. స్వయంశక్తి, ప్రకృతి పరిరక్షణతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. గత ఐదేళ్ల తన పాలీ హౌస్ సాగులో సాంప్రదాయ ఎరువుల వినియోగం ద్వారా కేవలం 25 శాతం మాత్రమే ఫెర్టిలైసర్స్ వినియోగించడం ద్వారా పంట నాణ్యత, రుచి, దిగుబడి ఎంతో పెరిగినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా, మండలాల వారీగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులతో పాటు, ప్రజలకు జన్యుమార్పిడి దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని, మితిమీరిన రసాయన వినియోగం, జీవరాశులకు హాని కలిగించే టెక్నాలజీని విడనాడాలని కోరారు.