దేశసేవే తన ఉద్యమాల ఊపిరి.. నేడు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (ప్రముఖులతో కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక ఫోటోలు)
ఎడిటర్ కె నరేష్ కుమార్ పద్మశాలి 9848025451
• మూడు దశల ఉద్యమాలకు ఊపిరిలూదిన కొండా లక్ష్మణ్ బాపూజీ.
• విశాలాంధ్రను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర.
• నిజాం నవాబు నిరంకుశ పాలనపై అలుపెరగని పోరాటం.
స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోయారు. ఉద్యమాలతోపాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండా లక్ష్మణ్ న్యాయవాద విద్యను అభ్యసించారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన సంఘటనలో నిందితుడిగా ఉన్నారు. ఈ సమయంలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని మద్రాసు పారిపోయారు. 1948లో నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించగా, విశాలాంధ్ర ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ, తర్వాత 1967,1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా, అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినేట్‌లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవికోసం పీవీ నరసింహారావుతో పోటీపడ్డారు.సీఎం పదవి దక్కనందుకు గవర్నర్‌గా నియమిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ పిలిచి చెబితే దానిని సున్నితంగా తిరస్కరించారు. ఇదే సమయంలో 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి పదవికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మర్రి చెన్నారెడ్డితోనూ విభేదించారు. ఇక, 2000లో మలి దశ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్‌ను ప్రోత్సహించడమే కాదు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యంను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. నాటి నుంచి అశోక్‌నగర్‌లోని అద్దె ఇంటిలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించారు.తెలంగాణ కోసం ఉద్యమించి, ఉద్యమకారులతో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా జంతర్‌మంతర్‌లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణా అంతటా బస్సుయాత్ర చేపట్టి, చార్మినార్ నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. సమైక్యవాదులతోపాటు ఉభయులకు న్యాయం జరగాలని కోరుకునే సామాజికవేత్త సాంబశివరావు లాంటి ఎందరినో ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలంటూ శాంతి చర్చలు జరిపారు.ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు. జన్మభూమి రుణం తీర్చుకోడానికి 2010లో తన స్వగ్రామం వాంకిడిలో లక్ష్మణ్ సేవాసదన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
సామాజిక సేవలు
1952లో బాపూజీ రూపొందించిన ‘సహకార సంఘాలు’ దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952లో ‘హైకో’ను ఏర్పాటు చేశారు. ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారు.
తెలుగునేలపై సైకిల్ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టాడు. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినపుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో 220 మైళ్ళు పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు అండగా నిలిచాడు. [3]
2010లో స్వగ్రామంలో లక్ష్మణ్ సేవా సదన్ పేరుతో ఒక స్వచ్చంధ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ, మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించినా ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే పురుడు పోసుకుంది. తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారు. 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారు
రాజకీయ జీవితం
హైదరాబాద్ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా సేవలందించారు.1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ లో చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రికి బదులుగా గవర్నర్ పదవి ఇస్తానని ఇందిరాగాంధీ ముందుకు వచ్చినా, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
నిజాం విమోచనోద్యమం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తాను అధ్యక్షునిగా ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ ఏర్పాటుచేసి ప్రజాచైతన్య కార్యక్రమాలు రూపొందించారు.నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించిన బాపూజీ. నారాయణరావ్ పవార్, గండయ్య, గూడూరు నారాయణ స్వామి, జగదీష్ ఆర్య అనే నలుగురు యువకులకు షోలాపూర్ క్యాంపులో శిక్షణ ఇచ్చారు. 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్ బజార్‌లో నారాయణరావు పవార్ బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. పవార్‌ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్ చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు ఉచిత న్యాయసహాయం చేశారు. విస్నూరు దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ‘నయాజిందగీ’ పత్రిక సంపాదకులు ఆచార్య జె.ఎన్. శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు.
మనమరాలు సంధ్య సహకారంతో .....
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ చివరి సమయం లో అంటే వయసు మీద పడడంతో నడవడం కూడా కష్టంగా మారింది దీంతో తన మనవరాలు కొండ సంధ్య రాణి సహకారంతో ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు సన్యాసహాయ సహకారాలతో అన్ని సమావేశాలు సభలకు హాజరయ్యేవారు. కొండ సంధ్య రాణి లేకపోవడంతో ఆయన బయటకు వెళ్లేవారు కాదు. అడుగు తీసి అడుగు వేయాలన్న తన నడిచే స్థితిలో లేని సమయంలో కొండ సంధ్య రాణి సహకారంతో ఉద్యమాలు కు సభలు సమావేశాలకు ఇతర కార్యక్రమాలకు కొండ సంధ్య రాణి ను తోడుగా తీసుకువెళ్లేవారు.
