Sports & Games

Breaking News

ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. సమ్మెలో ఆరోగ్య మిత్రలు

.
ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం
• నిరవధిక సమ్మెలోకి ఆరోగ్యమిత్రలు
• వేతనాలు పెంచాలని, కేడర్‌ పేరు డీపీవోగా మార్చాలని డిమాండ్‌
• 45 ఆస్పత్రుల్లో నిలిచిపోనున్న సేవలు
వేతనాలు పెంచాలని, కేడర్‌ మార్చాలని ఆరోగ్య మిత్రలు బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తుండటంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. నిరుపేదలకు వరంగా ఉన్న ఈ పఽథకంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆరోగ్యమిత్రల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు బంద్‌ కానున్నాయి. అధికారులు ఏం చేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
పథకం అమలులో ప్రముఖ పాత్ర
అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో నిరుపేదలకు ఈ పథకం వరంగా మారింది. కొన్ని వేల మంది ఈ పథకంతో లబ్ధిపొందడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. అందుకే ఈ పథకానికి దేశంలోనే మంచి పేరుంది. ఈ పథకాన్ని ముందుండి నడిపించేది ఆరోగ్యమిత్రలే. ఆస్పత్రికి ఒక కేసు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్టులో రిజిష్టర్‌ చేయడంతో పాటు ఆపరేషన్‌ చేయించి, ఆటో చార్జీలు సైతం ఇచ్చి ఇంటికి పంపించే వరకు వారు సేవలు అందిస్తారు. ఆపరేషన్‌కు అనుమతి తీసుకొని, తిరిగి ఫొటోలు తీసి పంపించి, ఆయా ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు జమ చేస్తున్నారు. అలాంటి తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా తమ మొర ఆలకించడం లేదని అంటున్నారు. అందుకే సమ్మె చేయడానికి నిర్ణయించుకొని పథకం జిల్లాల బాధ్యులకు నోటీసులు ఇచ్చారు.
డిమాండ్లు ఇవే..
2007లో ఆరోగ్య మిత్రలకు నెలకు రూ.3,500 వేతనం ఇచ్చారు. 2012లో రూ.7,200కు పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో రూ.12,000 ఇచ్చింది. అదే ఏడాది పీఆర్‌సీ ప్రకారం రూ.15,600 ఇచ్చారు. అయితే పీఎఫ్‌, ఈఎ్‌సఐ కట్‌ అయ్యి, రూ.13,300 మాత్రమే వేతనం వస్తోంది. ఆ వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా లేదని, రూ. 22,750కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం, నైపుణ్యంతో కూడుకున్న విధులు నిర్వర్తిస్తున్నందున కేడర్‌ పేరును డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌గా మార్చాలని కోరుతున్నారు.