Sports & Games

Breaking News

ప్రపంచ ఆరోగ్య అవసరాలు తీర్చిదిద్దేది ఫార్మర్ లే..

.ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం: 25 సెప్టెంబర్ 2024

ప్రపంచ ఆరోగ్య అవసరాలు తీర్చుతున్న ఫార్మసిస్ట్ లు!

డాక్టర్ రాపోలు సత్యనారాయణ 
ఫోన్: 9440163211 

ఫార్మసిస్ట్ లు ఆరోగ్య రక్షణ రంగ వ్యవస్థలలో అంతర్భాగం. ఆరోగ్య అవసరాలు తీర్చటంలో వారిది ముఖ్య పాత్ర. ఆవశ్యక ఔషధాలు అందించుట, వాటి సరియైన వినియోగం చూచుట ఫార్మసిస్ట్ ల ప్రధాన విధి. ఔషధాలతో పాటు, వ్యాక్సిన్ లు, వైద్య పరికరాలు, శస్త్ర పరికరాలు, వ్యాధి నిర్ధారణ వస్తువులు, ఆరోగ్య ఉత్పత్తులు అందించేది ఫార్మసిస్ట్ లే. కొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి, ఔషధ నిఘా చేసేది, ఆంటీ బయోటిక్స్ అవసరానుగుణ వినియోగం చూచేది కూడా ఫార్మసిస్ట్ లే. ఔషధ నిపుణులుగా రోగి సంరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణలో వారి భూమిక ముఖ్యమైనది. ఔషధ వితరణతో పాటు, ఔషధాల సహేతుక వినియోగం, దీర్ఘ వ్యాధుల నిర్వహణ ఫార్మసిస్ట్ పరిధి లోనివే! అసంక్రామిక వ్యాధులు, అంటు వ్యాధులు, విపత్తుల నిర్వహణలో ఫార్మసిస్ట్ లు తమ సేవలు అందిస్తున్నరు. చాలా చోట్ల ఆరోగ్య సలహా మరియు ప్రాథమిక చికిత్స కోసం తొలుత లభ్యమయ్యే వ్యక్తులు ఫార్మసిస్ట్ లే. వ్యాధుల నివారణ, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య అక్షరాస్యత, రోగి విద్య, ప్రజారోగ్య ప్రచారం వంటివి చేపట్టుతరు. ఆరోగ్య రంగ విధానపరమైన మార్పులు సూచించుట, ఆరోగ్యపరమైన సత్ఫలితాలు సాధించుటలో ఫార్మసిస్ట్ ల పాత్ర చాలా ఉన్నది. హాస్పిటల్, కమ్యూనిటీ, పరిశ్రమ, పరిశోధన, బోధన, ఔషధ నియంత్రణ శాఖ వంటి భిన్న రూపాలలో ఫార్మసిస్ట్ లు ప్రజలకు సేవ చేస్తున్నరు. కోవిడ్ 19 సమయంలో ఫార్మసిస్ట్ లు ముందు వరుసలో ఉండి ప్రాంతీయ, ప్రాపంచిక ఆరోగ్య సంక్షోభాలు అధిగమించటానికి తోడ్పడిన విషయం అందరికి తెలుసు. 
ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ (ఎఫ్ ఐ పి) ప్రతి ఏటా సెప్టెంబర్ 25 నాడు "ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం" పాటిస్తున్నది. ఈ ఏటి నినాదం "ఫార్మసిస్ట్స్: మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్". ఫార్మసిస్ట్ ల సేవలను గుర్తించి, వారిని గౌరవించు కొనటానికి, వారు సేవలో పునరంకితులు కావటానికి ఈ సందర్భం దోహద పడుతున్నది. అంతటి మహత్తర ఫార్మసిస్ట్ లను మన దేశంలోని వ్యవస్థలు పూర్తి స్థాయిలో వినియోగించుకో లేక పోతున్నయి. 
ప్రపంచంలో భారత్ మూడవ అతి పెద్ద ఔషధ ఉత్పాదక దేశం. ప్రపంచానికి 60% వ్యాక్సిన్, ఆఫ్రికా కు 50%, అమెరికాకు 40%, యునైటెడ్ కింగ్డమ్ కు 25% జెనెరిక్ ఔషధాల అవసరాలను భారత్ తీర్చు తున్నది. కాని, ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే హాస్పిటల్ మరియు కమ్యూనిటీ విభాగాలలో చాలా వెనుకబడి ఉన్నది. ఫలితంగా, ఉన్నత విద్యా వంతులైన ఫార్మసిస్ట్ లు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నరు లేదా ఇష్టం లేని ఇతర రంగాలకు మరల వలసి వస్తున్నది. ప్రభుత్వం పూనుకొని అన్ని మెడికల్ కాలేజ్ లలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ స్థాపించాలె. కమ్యూనిటీ విభాగంలో బ్యాంక్ రుణ సౌకర్యం కల్పించి కమ్యూనిటీ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్ రంగంలో ఉపాధి కల్పించాలె. ఫార్మసిస్ట్స్ డే సందర్భంగ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలె. ఫార్మసిస్ట్ ల సేవలు వినియోగించు కొనే, వారికి మేలు చేసే విధాన నిర్ణయాలు ప్రకటించాలె. ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందించాలె. ఫార్మసిస్ట్ ల మేలు ప్రజల ఆరోగ్యానికి మేలు! 

(వ్యాసకర్త ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)