మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు.. ప్రకటించిన అక్కినేని నాగార్జున
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. శుక్రవారం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారన్నారు. ఈ వారాంతంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని.. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదన్నారు. రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
