ప్రాథమిక దశలోనే గుర్తిస్తే కుష్టు రోగులకు మేలు జరుగుతుంది
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ :- కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే కుష్టు రోగులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రురల్ మండలం లోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేలో ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని అనుమానిత కేసులను గుర్తించి చికిత్స ప్రారంభించాలని, పూర్తి చికిత్స పొందేలా చూడాలని కోరారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. కుష్టు వ్యాధికి పూర్తి చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఎటువంటి భయం లేకుండా పరీక్షా చేయించుకోవాలని పిలుపునిచ్చారు.అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్య సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అమలు చేయడంలో ముందు ఉండడంతో వారిని అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఇది వరకే జిల్లాల్లో పలు మార్లు ఈ సర్వేను నిర్వహించామన్నారు. సమాజంలో దాగి ఉన్న కేసులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేకు అందరు సహకరించాలని కోరారు.జిల్లాను కుష్ఠురహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలనీ కోరారు. జిల్లా కుష్టు నివారణాధికారి డాక్టర్ గజానన్ జిల్లాలో కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమ అమలు తీరుతెన్నులను వివరించారు. జాతీయ వాయు కాలుష్య దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ సాధన, మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్, వైద్యులు సాగర్,సర్ఫరాజ్,డీపీఎంవోలు వామన్ రావు, రమేష్, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి ,పర్యవేక్షకులు సుభాష్, సురేష్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.